వ్యాపార వ్యూహాలలో ప్రాధాన్యత సంతరించుకున్న డేటా విశ్లేషణ
డేటా వినియోగం, నిర్వహణలో నైతికత అత్యంత అవశ్యకం

ప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):“ఆధునిక పరిపాలన, వ్యాపార వ్యూహాల్లో డేటా కీలకమైన స్థానం కలిగి ఉంది. విశ్లేషణలు, కృత్రిమ మేధస్సును సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గల సంస్థలే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తాయి” అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సర్వే సెటిల్ మెంట్, భూపరిపాలన) ఆర్.పీ. సిసోడియా అన్నారు. “బిజినెస్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్‌లో పురోగమనలు” అనే అంశంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు సిసోడియా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు నేతృత్వంలో రాష్ట్రంలో అధునిక సాంకేతిక పరిపాలనకు సాగుతోందని, ప్రతి ఒక్కరూ దానిని అందిపుచ్చుకోవాలని కోరారు. సిసోడియా ప్రసంగిస్తూ డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను వివరించారు. ఆదాయ నిర్వహణ నుంచి ప్రజా సేవల దాకా అనేక రంగాల్లో కృత్రిమ మేధస్సు, పెద్ద డేటా విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాయని, వాటి ద్వారా ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు మంచి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. డేటా విశ్లేషణను సమర్థంగా వినియోగించుకునే సంస్థలు ఆర్దిక అభివృద్ధిలో ముందంజలో ఉంటాయన్నారు. డేటా ఆధారిత భవిష్యత్తుకు విద్యార్థులు, నిపుణులను సిద్ధం చేయడం చాలా అవసరమని, డేటా వినియోగంలో నైతికత అత్యంత కీలకమైన అంశమన్నారు. ఎవరు డేటాను సమర్థంగా విశ్లేషించి, అర్థం చేసుకుని, నిపుణంగా నిర్ణయాలు తీసుకుంటారో వారిదే భవిష్యత్తు అన్న సిసోడియా వారే విజయం సాధిస్తారని స్పష్టం చేసారు. డేటా ఆధారిత భారతదేశాన్ని నిర్మించేందుకు మనమందరం కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఒప్పందాలు, సంశోధనలో భాగస్వామ్యం పెరగడం అభినందనీయమని అన్నారు. డేటా ఆధారిత యుగంలో నిరంతర అభ్యాసం, మార్పులకు అనుగుణంగా తమని తాము మలచుకోవడం చాలా అవసరమని సూచించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి అచార్య కె. గంగాధర రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం బిజినెస్ అనలిటిక్స్ పరిశోధన, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు అకడెమియా-ఇండస్ట్రీ కలయిక అవసరమన్నారు. సదస్సు డైరెక్టర్, వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగాధిపతి అచార్య రామినేని శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపార వ్యూహాలలో డేటా విశ్లేషణ ప్రాధాన్యతను వివరించారు. ఇలాంటి అకడమిక్ సదస్సులు విద్యార్థులు, పరిశోధకులకు విలువైన పరిజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. సదస్సులో ప్రముఖ విశ్వవిద్యాలయాల నిపుణులు ఈ అంశంపై దృక్పథాలను పంచుకున్నారు. ఐఐఎం విశాఖపట్నంకు చెందిన అచార్య విజయ భాస్కర్ కీలకోపన్యాసం చేస్తూ బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో ఎఐ, మెషిన్ లెర్నింగ్ పెరుగుతున్న ప్రభావాన్ని వివరిస్తూ, నైతిక డేటా నిర్వహణ కీలకమని అన్నారు. ఐఐఎం రాయ్‌పూర్‌కు చెందిన వర్ష మామిడి, మేధో సంపత్తి హక్కులు, డేటా విశ్లేషణ అనుసంధానంపై మాట్లాడారు. ఐపీఈ హైదరాబాదు డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస మూర్తి, భవిష్యత్తు అంచనాల ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ పరిశ్రమల్లో దీని వాస్తవ ఉపయోగాలను తెలియజేశారు. వ్యాపార విశ్లేషణలో ఆధునిక సాంకేతికతల పాత్ర, పెద్ద డేటా నిర్వహణలో సవాళ్లు, ఎఐ ఆధారిత విశ్లేషణలు ఎలా పరిశ్రమలను మార్చుతున్నాయనే అంశాలపై సదస్సు చర్చించింది. కార్యక్రమంలో డాక్టర్ కనకదుర్గ, డాక్టర్ రత్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు.