ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి నగరం అభివృద్ధి దిశగా ముందుకు వెళతామని- తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణ తమకు అప్పగించారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళతామని చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ మాట్లాడుతూ స్వర్ణముఖి నది ఆక్రమణల తొలగింపు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే జరుగుతుందని తెలియజేశారు.త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆపరేషన్ స్వర్ణ ముందుకు వెళుతుందని చెప్పారు.తిరుపతి నగరాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తుడా చైర్మన్ తెలిపారు.నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.శెట్టిపల్లి 68 ఎకరాలు తుడా అభివృద్ధి చేస్తుందని,సుమారు 48 నుండి 50 ఎకరాల భూమిలో 1800 ఇళ్లు నిర్మాణం చేస్తామని తెలిపారు,ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 320 మంది రైతులకు లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు చేస్తామని, ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు.వినాయక సాగర్ లా అవిలాల చెరువును అభివృద్ధి చేసి,తిరుపతిలో 70–80 తాగునీటి వనరులను సుస్థిరంగా తయారు చేస్తున్నారు.వానాకాలంలో తిరుపతి మునిగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు,పేరూరు నుండి కాశీం కాలువ ద్వారా నీటి ప్రవాహం నియంత్రణతో అవిలాల చెరువులో నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సబ్సిడీ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం కారణంగా 5 కోట్ల మంది సంతోషంగా ఉన్నారని తెలిపారు,ఈ అభివృద్ధి పయనాన్ని కొనసాగిస్తామని చైర్మన్ పేర్కొన్నారు.తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత,అభివృద్ధి మరియు ప్రజా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.గరుడా వారధి పైన ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా,మున్సిపల్ అధికారులతో మాట్లాడి అల్యూమినియం రైలింగ్‌ల ఏర్పాటు చేపడుతున్నాం అని తెలిపారు.2019 నుండి 2024 వరకు అభివృద్ధి నిలిచిపోయినా,కేవలం 18 నెలల్లో తిరుపతిలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి అని తెలిపారు. మరియట్,లెమన్ ట్రీ వంటి స్టార్ హోటళ్లు ప్రారంభం అయ్యాయని,నోవోటెల్ పార్క్, పోస్ట్‌కార్డ్ హోటల్ వంటి ప్రాజెక్టులు ప్రారంభంకానున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమాల ద్వారా పర్యాటకాన్ని పెంచి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిని మరింత అందంగా,సుస్థిరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తుడా చైర్మన్ తెలిపారు.
