ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విజయం సాధించడం సులభమని ప్రముఖ బాల మనోవైద్య నిపుణులు డాక్టర్ వి. సురేశ్ బాబు స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ సురేశ్ బాబు విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. విద్యార్థులు తమలోని అంతర్గత బలాలు, ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, పాజిటివ్ సైకాలజీ ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఆయన సూచించారు. గ్రామీణ విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ: వీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ప్రొ. అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో ఎన్‌ఎస్‌ఎస్ వంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. “కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, జీవన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి సరైన దిశలో ప్రోత్సహిస్తే, వారు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తారు,” అని వీసీ పేర్కొన్నారు. సామాజిక బాధ్యతే లక్ష్యం: విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయశంకర్ అల్లం మాట్లాడుతూ విద్యార్థుల్లో సానుకూల ఆలోచన, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో ఇలాంటి విలువల ఆధారిత కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమ చివరలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నాగభూషణరావు సదస్సు విజయవంతానికి సహకరించిన పాఠశాల సిబ్బందికి, గ్రామస్తులకు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.