ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ), నెల్లూరు బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యన్ ఎస్ ఎస్ వాలంటీర్ ఎం. పృథ్విరాజ్ సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను యన్ ఎస్ ఎస్ జాతీయ ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు ప్రదానం చేశారు. ఈ వేడుకలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడాశాఖ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల యన్ ఎస్ ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వి.ఎస్.యూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “మా విశ్వవిద్యాలయానికి ఇది గర్వకారణం. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవలో అంకితభావాన్ని చూపడం విశేషం. పృథ్విరాజ్ సాధించిన ఈ జాతీయ అవార్డు ఇతర యువతకు ప్రేరణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. వి.ఎస్.యూ రిజిస్ట్రార్ డా. కే. సునీత మాట్లాడుతూ, “పృథ్విరాజ్ సాధించిన ఈ జాతీయ స్థాయి గౌరవం వి.ఎస్.యూ ప్రతిష్ఠను పెంచింది. విద్యార్థులు విద్యా ప్రగతితో పాటు సామాజిక బాధ్యతల పట్ల చూపుతున్న నిబద్ధత విశ్వవిద్యాలయానికి గర్వకారణం. పృథ్విరాజ్ వంటి యువతే సమాజానికి ఆదర్శం” అని అభినందించారు. కాలేజ్ ప్రిన్సిపాల్ డా. సిహెచ్. విజయ మాట్లాడుతూ, “మా కళాశాల విద్యార్థి పృథ్విరాజ్ జాతీయ స్థాయిలో యన్ ఎస్ ఎస్ ఉత్తమ వాలంటీర్ అవార్డును అందుకోవడం గర్వకారణం. ఈ విజయంతో మా కళాశాల ప్రతిష్ఠ మరింత పెరిగింది. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవలోనూ అగ్రగాములు కావాలని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాము” అని తెలిపారు. యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. ఉదయ శంకర్ అల్లం మాట్లాడుతూ, “పృథ్విరాజ్ పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి యన్ ఎస్ ఎస్ యూనిట్ల ప్రతిష్ఠను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది” అని ప్రశంసించారు. జాతీయ అవార్డును స్వీకరించిన అనంతరం శ్రీ ఎం. పృథ్విరాజ్ మాట్లాడుతూ, “ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మా వి.ఎస్.యూ యన్ ఎస్ ఎస్ యూనిట్ మొత్తానికి దక్కిన గౌరవం. సమాజ సేవలో మరింత కృషి చేస్తూ, గ్రామీణాభివృద్ధి మరియు యువత శ్రేయస్సు కోసం పనిచేస్తాను” అని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, భోధన, భోధనేత్రర సిబ్బంది యన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మరియు యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ లు అతనికి అభినందనలు తెలిపారు.
