సుప్రీం కోర్టు న్యాయమూర్తి… ఆయన ఇచ్చిన తీర్పులు చరిత్రలో మైలురాళ్లు
కోలార్, చిక్ బళ్ళాపూర్ నీటి సమస్య పరిష్కారంపై నావంతు ప్రయత్నం చేస్తా: పవన్ కళ్యాణ్
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘రాజ్యాంగ పరిరక్షణకు పదవి బాధ్యతల్లో ఉంటూ ఎంత సేవ చేశారో… పదవీ విరమణ తరవాత కూడా రాజ్యాంగ రక్షణకు నిరంతర పోరాటం చేస్తున్న గొప్ప న్యాయ కోవిదులు జస్టిస్ వి.గోపాల గౌడ జనసేన పార్టీ సిద్ధాంతాల విషయంలోగానీ, జనసేన పార్టీ పోరాటాల్లోగానీ ఆయన అండగా నిలిచిన తీరు నాకు ఎప్పటికీ గుర్తే. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రజలకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలకు ఇప్పటికీ ఆయన నవ యువకుడిలా ముందుండే తీరు అబ్బురం అనిపిస్తుంది. యువత, వారి భవిష్యత్తు గురించి మేము ఇరువురం చర్చించుకున్నప్పుడు అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అవి నాకు కొత్త మార్గాలను చూపిస్తాయని, అలాంటి వ్యక్తి 75వ ఒడిలోకి అడుగుపెట్టడం, అలాంటి గొప్ప సందర్భంలో నేను పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంద’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. న్యాయవిద్య అభ్యసించి బెంగళూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నో అద్భుతమైన తీర్పులు నిక్కచ్చిగా, నిజాయతీగా అందించిన వ్యక్తిగా జస్టిస్ వి.గోపాల గౌడ గారు నిలిచిపోతారని కొనియాడారు. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్ళాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో సోమవారం జరిగిన జస్టిస్ వి.గోపాల గౌడ 75వ జన్మదిన అమృత మహోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జస్టిస్ వి.గోపాల గౌడ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కర్ణాటక సృజనకు, సంస్కృతికి, సంప్రదాయానికి దిక్సూచి. అపారమైన చరిత్ర కలిగిన గొప్ప నేల. ఇక్కడ నుంచి ఇంజినీరింగ్ లో అద్భుతాలు చేసిన తొలి తరం ఇంజినీరింగ్ నిపుణుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతీయ కవి, నాటక రచయిత, నవలా రచయిత, విమర్శకుడు కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప (కువెంపు) మహనీయులు జన్మించారు. ఇలాంటి గొప్ప భూమిపై న్యాయ కోవిదులు, రైతులు, కార్మికులు, కర్షకుల పక్షాన తన గళం వినిపించిన జస్టిస్. వి. గోపాల గౌడ లాంటి వ్యక్తులు ఉండడం మన అదృష్టం. చిక్ బళ్ళాపూర్ జిల్లాలోని పెరూరు అనే పల్లెటూరులో రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు మట్టి వాసన తెలుసు. చిన్ననాటి నుంచి రైతులు కష్టాలు, కార్మికుల కండగండ్లు స్వయంగా చూసిన వ్యక్తి. ఫీజుల కోసం న్యాయవాదిగా ఉండిపోకుండా… కష్టం ఉన్న ప్రతి దగ్గరకు ఆయన వెళ్లేవారు.
ఆయన తీర్పులు… చరిత్రలో మైలురాళ్లు: జస్టిస్ వి.గోపాల గౌడ తీర్పులు చాలా నిక్కచ్చిగా, నిజాయతీగా ఉంటాయి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రోగి విషయంలో ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భర్తను కోల్పోయిన భార్యకు న్యాయం చేస్తూ ఇచ్చిన తీర్పు మర్చిపోలేం. బాధితులకు ఏకంగా రూ.6.8 కోట్లు నష్టపరిహారం ఇప్పించగలిగారు. నష్ట పరిహారం అంటే సమంజసంగా ఉండాలి. ఒక కుటుంబ యజమాని చనిపోతే దానికి సంబంధించి నష్టపరిహారం ఆ కుటుంబానికి దారి చూపేదిగా ఉండాలని ఆయన ఇచ్చిన తీర్పు తరువాత ఎన్నో కేసుల్లో బాధితులకు దారి చూపే ల్యాండ్ మార్క్ తీర్పు అయ్యింది. పాత చట్టాల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం ఎంత వరకూ సబబు అంటూ రైతు పక్షాన నిలిచిన గొప్ప న్యాయమూర్తిగా గోపాల గౌడ నిలిచిపోతారు. భూ సేకరణ చట్టం 2013 సెక్షన్ 24 పేరాగ్రాఫ్-2లోని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, రైతు దగ్గర నుంచి భూమి తీసుకుంటే ఐదేళ్లుగా పరిహారం చెల్లించని పక్షంలో భూములను తిరిగి రైతులకు అందజేయాలని చెప్పిన గొప్ప మనసున్న న్యాయమూర్తిగా జస్టిస్ వి.గోపాల గౌడ రైతులకు ఎప్పటికీ గుర్తుంటారు.
నా కష్టాల్లో తోడుగా నిలిచిన వ్యక్తి: జనసేన సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారుగా గోపాల గౌడ నిలిచారు. ఆయన కేవలం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిగానే కాదు … పాలకుల రాజ్యాంగ తప్పిందాలపై బలంగా గళమెత్తగలిగిన పోరాట యోధుడు. జనసేన పార్టీ ప్రజల పక్షాన చేసిన పోరాటాల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. భూ సేకరణ చట్టంపై, నల్లమల్ల అటవీ పరిరక్షణపై పోరాటంలో పార్టీకి అండగా నిలిచారు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమయంలో మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాలను ఏ మాత్రం సంకోచం లేకుండా పంచుకున్నారు. యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ అంశాల పట్ల ఆయన అందించే స్ఫూర్తి ఎనలేనిది. నేను, జస్టిస్ వి.గోపాల గౌడ యువత గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం మాలో ఉన్న సమాంతర లక్షణం. మహిళలు, రైతు, పర్యావరణ సమస్యలపై నిత్యం మాట్లాడుకుంటాం. గోపాల గౌడ వంటి వ్యక్తులతో పరిచయం, వారి మార్గదర్శకం జనసేన పార్టీకి చాలా అవసరం. సినిమాల్లో నేను ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు దేశ భవిష్యత్తు, యువత పరిస్థితి గురించి ఆలోచించి వారి కోసం ఏదైనా చేయడానికి రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. జనసేన పార్టీ ఓటమి సమయంలో జస్టిస్. వి. గోపాల గౌడ నాకు అండగా నిలిచి మంచి రోజులు వస్తాయి. అధైర్య పడకు అని చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తే.
నీటి సమస్య తీర్చేందుకు సోదరుడిగా నా వంతు ప్రయత్నిస్తా: స్థానికంగా ఉన్న నీటి సమస్య గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. ఈ ప్రాంతం పెన్నారు, పాలార్ నదుల స్థానం. కోలార్ ప్రాంతం ఒకప్పుడు సరస్సులతో నిండి ఉండేది. ఐదు వేలకుపైగా చెరువులు ఉండేవి. దక్షిణాసియాలోనే అత్యధిక చెరువులు, సరస్సులు కలిగిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. మన పూర్వీకులు నీటి సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం. కోలార్, చిక్ బళ్ళాపూర్ ప్రాంతాలు రాష్ట్రానికి ఆహారం అందించే అక్షయపాత్రలు. ఇక్కడ నీటి సమస్యపై కచ్చితంగా దృష్టి సారించాలి. దీనికి సంబంధించి సోదరభావంతో నీటి సమస్యను పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.
పరస్పర గౌరవ భావంతో మెలుగుదాం: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా బలమైన సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. లక్షలాది తెలుగు కుటుంబాలు కన్నడ నేలపై ప్రశాంతంగా జీవిస్తూ ఇక్కడి సామాజిక, సంస్కృతిక విలువలను బలపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో 57 పాఠశాలల్లో కన్నడ మాధ్యమంలోనే విద్యను అందిస్తూ కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు, భాషాను కాపాడుతున్నాం. సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని బలంగా కలిపే వారధిలా ఉండాలి తప్పితే విడదీయకూడదు. ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా ఉన్న మనం సోదరభావంతో స్నేహపూర్వక వాతావరణంలో పరస్పర గౌరవ భావంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక సంప్రదాయాలపై చాలా గౌరవం ఉంది. ఈ ప్రాంత కళలు, సంస్కృతిని మేము గౌరవిస్తాం.
బోర్డర్లు మనల్ని వేరు చేయలేవు: మ్యాప్ లో ఉండే బోర్డర్లు మనల్ని వేర్వేరు రాష్ట్రాలుగా చూపించినా… సహకారం అందిపుచ్చుకోవడంలో మనమంతా ఒక్కటే అని ఎన్నోసార్లు రుజువు చేశాం. మదపుటేనుగుల బారి నుంచి పంటలను, మనుషుల ప్రాణాలను కాపాడటానికి కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు అందించింది. ఈ అంశం ఇరు రాష్ట్రాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడింది. కుంకీ ఏనుగుల ఒప్పంద సమయంలో శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు సౌకర్యం, వసతులు కల్పించాలని కర్ణాటక మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను సంబంధిత అధికారులతో చర్చించాం. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తాం. ఆయన జీవితం భావి తరాల్లో స్ఫూర్తి నింపాలి. జస్టిస్ వి. గోపాల గౌడకి మరోసారి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అమృత మహోత్సవంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. అమృత మహోత్సవ కార్యక్రమం అనేది ఏదో సరదాకు చేసుకునే కార్యక్రమం కాదు. 75 ఏళ్ల జీవితంలో ఆయన దాటిన మైలురాళ్లు, పాటించిన ఆదర్శాలు గుర్తు చేసుకోవడం. జీవితాన్ని నిస్వార్థంగా, పక్కవాళ్ల కోసం బతకడం అంత తేలికైన విషయం కాదు. గోపాలగౌడ అలా బతికి చూపించారు. ఆయన మానవతా దృక్పథం భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలి. ఈ శుభ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో జీవించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నానని అన్నారు.
మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్-జస్టిస్ వి.గోపాల గౌడ : జస్టిస్ వి.గోపాల గౌడ మాట్లాడుతూ “నిరంతరం ప్రజల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ పది రోజులుగా ఆయన అస్వస్థతగా ఉన్నా నా మీద ఉన్న ప్రేమాభిమానాలతో కార్యక్రమానికి రావడం సంతోషాన్ని ఇచ్చింది.పవన్ కళ్యాణ్ తో పరిచయం తరువాత ఆయన ఆలోచనలు దేశ గతిని మార్చే గొప్ప శక్తిమంతమైనవని అనిపించింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమపడ్డాను. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఈ ప్రాంత ప్రగతి కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని మాటిస్తున్నాను. ఆజన్మాంతం ఈ ప్రాంతానికి రుణపడి ఉంటాను. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న నీటి సమస్య మీద నాయకులు దృష్టి సారించాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టిసారించాలని కోరుతున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వి.సోమన్న, కోలార్ ఎంపీ బి. మల్లేష్ బాబు, కర్ణాటక విధాన సభ మాజీ ఉప సభాపతి ఎం. కృష్ణారెడ్డితోపాటు డాక్టర్ ఎన్. యుదుష్టరావు, నవీన్ జి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

