ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘గొర్లుబర్లు కాసేటోడు.. అమ్మఅయ్య లేనోడు.. అక్షరం ముక్క రానోడు.. ఏమౌతాడు..’ అంటే.. ‘అనాథ’ అవుతాడు అంటుంది లోకం. కానీ అతడు అనాథ అవ్వలేదు.. ‘అందెశ్రీ’ అయ్యాడు. పల్లెని ప్రకృతిని ప్రేమించినోడు, సమాజాన్ని దగ్గరుండి చూసినోడు, మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపినోడు, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పాటగాడు అన్నీ ఆయనే.. అక్షరజ్ఞానం లేకపోతేనేం ఆయన పద్యాలు, పాటలు జనం నోళ్లల్లో నీరాజనాలయ్యాయి. ‘ఒకటే మరణం.. ఒకటే జననం..’ ఆయన శరీరానికే.. పాటకి, మాటకి కాదు.. ‘కొమ్మ చెక్కితే బొమ్మ అయినట్లు.. కొలిచి మొక్కితే అమ్మ అయినట్లు..’ అక్షరం వెలుగులో అందెశ్రీ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు.. ప్రజాకవులు ఎందరో ఉన్నా.. అందెశ్రీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే.. సమాజంలో చూసిన, విన్న విషయాలపై ఆయన కవితలు, పాటలు పాడలేదు. ఆయన పాడిన పాటల్లోని ప్రతి పదం ఆయన స్వయంగా అనుభవించింది. కూలిపనికి పోయేటోడు, జీతగాడు, పశువుల కాపరిగా దుర్భర దారిద్ర్యం అనుభవించిన అందె ఎల్లయ్య.. ఆకలి తీర్చుకోవడం కోసం
ఇల్లు ఇల్లు తిరిగి భిక్షం ఎత్తుకున్నాడు. కూలి చేయడం కోసం తాపీ కర్ర, మూటముల్లె భుజాన తగిలించుకుని ఊరూర తిరిగాడు. ఈ జీవితం గురించి చెప్పడానికి అతను ఎప్పుడూ సిగ్గుపడలేదు.. పైగా గర్వంగా చెబుతాడు. ‘ఆ కష్టాలను మర్చిపోడానికే పదాలు కట్టి పాటలు పాడాను’ అంటారు. ‘తల్లిదండ్రుల ప్రేమకి నోచని వాడ్ని నేను.. ఓ అనామకుడిని ఇంతమంది ప్రేమకి పాత్రుడిని చేసింది ఆ పాటలే. కళ్లముందున్న ప్రపంచమే నా పాఠశాల.. ప్రకృతే నాకు అమ్మ.. నా ఆలోచనలే నా అయ్య’ అని చెబుతారు.
అక్షరాలు రాకపోతేనేం..: తెలంగాణ మారుమూల పల్లె (1961 సిద్ధిపేట జిల్లా రేబర్తి గ్రామం)లో పుట్టిన అందెశ్రీకి అక్షరాలు రాకపోతేనేం, అతని నోటివెంట ఆశువులా వచ్చే ప్రతి కవితా ఎంతో భావుకత ఉట్టిపడుతుంది. పదగాంభీర్యం ఉట్టిపడే ఆ కవితల్లో లోతైన సాహిత్యం ఉంటుంది. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నేను బళ్లోకి పోలేదు. కానీ నా తొలి గురువు జక్కిరెడ్డి మల్లారెడ్డి అని చెబుతాను. ఎందుకంటే ఆయన, నాతో పనులు చకచకా చేయించుకోవడానికి పురాణాలని కథలుగా చెప్పేవాడు. ఆ మాటలు వింటున్న నాలో తెలియకుండానే వైరాగ్యం, ఆధ్యాత్మికత ప్రవేశించాయి. అయితే నేను ఆశువుగా పాడే ప్రతి పాటలో నేను పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు ముందు నా పాటని, తరువాత నన్ను ఎంతోమందికి దగ్గర చేశాయి’ అని చెబుతారు. ‘అందె ఎల్లయ్య కాస్తా, అందె శ్రీగా మారడానికి గల కారణం కూడా అదే’ అంటారు.
ఆధ్యాత్మికత అంటే..: ఆధ్యాత్మికం గురించి ఆయన చెప్పిన మాటలు చాలామందికి రుచించవు. కానీ ఆయన మాత్రం తనకు తెలిసిన జ్ఞానాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా వెలుగెత్తి చాటారు. ‘ఆధ్యాత్మికత అంటే దేవుడిలో లీనమవ్వడం కాదు. ప్రకృతికి దగ్గరగా బతకడం. మనిషితనం చెడకుండా జీవించడం. నేలమీద బతకడం. పంచ భౌతికతత్వంతో పరాచకమాడకపోవడం’ అంటారు.
పల్లెకి దగ్గరగా..: ‘కష్టాలను మర్చిపోవడానికి పద్యానికి అలవాటు పడ్డాను’ అనే ఆయన నోటివెంట వచ్చిన ఈ పద్యం ఆయన జీవితానికి దర్పణం పడుతుంది. ‘పల్లె నీకు వందనాలు అమ్మ../ ననుగన్న పల్లె తల్లి నీకు వందనాలు అమ్మ../ నాకు పాట నేర్పి, మాట నేర్పి, బతుకు బాట చూపినందుకు/ పల్లె నీకు వందనాలు అమ్మ../ పాలు మరిసి జీతగాన్నై పశులు గాసే రోజులల్లో… పాడు గోదలు ఎలుగులు దుంకి పంటచేలు పాడుచేస్తే../ పల్లె కాపులు కళ్లురిమి పశుల మాదిరి తరిమికొడితే../ వెక్కి వెక్కి ఏడ్సి నేను.. దిక్కు లేని పక్షినైతే/ ఉసికికప్పుల పాన్పువేసి ఊరడించిన పల్లె నీకు వందనాలు అమ్మ..’ అన్న పాట ఒక్క అందెశ్రీ అనుభవించిన కష్టాలనే బహిర్గతం చేయదు. ఎందరో వెట్టి బానిసల వెతలకి అది ప్రతిబింబం.
శరీరాన్ని ముక్కలు చేసిన వ్యవస్థ ఇది..: చాతుర్వర్ణ వ్యవస్థ గురించి అందెశ్రీ ఒకసారి ఇలా చెప్పారు. ‘తలలో పుట్టిన బాపడు.. పాదాల్లో పుట్టిన శూద్రుడు.. భుజస్కందాల్లో పుట్టిన క్షత్రియుడు. నాభితొడల మధ్యలో పుట్టిన వైశ్యుడు.. ఈ నలుగురు కాదు.. పంచమ వర్గం కూడా నా శరీరంలో భాగమే.. ఈ వ్యవస్థ మనిషిని తెగనరికిన తరువాత వచ్చిన వ్యవస్థ. ఒక్క మనిషిని ఐదు ముక్కలుగా తెగనరికినారు. ఈ ముక్కలన్నీ అతికితే ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషితనం ఎక్కడ ఉంటాడో.. ఆ మనిషితనపు ఆనవాళ్లు ఎక్కడుంటాయో.. అతని చిరునామా ఎక్కడుంటదో.. అక్కడ నేనుంటా!’ అంటారు.
‘నా కవిత్వం ప్రపంచాన్ని మార్చదు.. కానీ..: సమాజంలో పేరుకు పోతున్న కుళ్లుని, అన్యాయాలని, అక్రమాలని తన పాటలలో,
పద్యాలలో వల్లెవేసిన అందెశ్రీ ‘తన కవిత్వం ప్రపంచాన్ని మారుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు’ అంటారు. అయితే తన భావాలని చెప్పడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందుంటారు. అలా వచ్చిందే ఈ కవిత. ‘కనరా.. కనరా.. ప్రపంచాన్ని కనులారా../ వినరా.. విశ్వాన్ని చెవులారా../ ప్రవక్తలెందరు వచ్చినా.. ప్రపంచమేమన్నా మారెనా../ ఎవరివల్ల మారినదెంత.. కన్నీళ్లే ఈ జగమంతా..మనలో మనమే మారకపోతే.. మారెదెప్పుడు మానవ చరిత.. / అంటూనే మరో కవితలో పాండిత్యం.. పండితుల కుటుంబాల్లో../ ప్రతిభ పెట్టుబడి ఉన్న వర్గాల్లోనే పుట్టదు/ కళ.. ఏదైనా ప్రజల నుండి.. ప్రకృతి నుండి పుడుతుంది. దానికి కులం, మతం అంటూ మాట్లాడితే అది ఇంత ముక్కే మిగులుతుంది’ అని పదునైన మాటల్లో పలికారు.
సినిమారంగం..: ఇంత ప్రతిభ ఉన్న అందెశ్రీ దుర్భర దారిద్య్రంలో జీవితాన్ని అంతం చేసుకోవాలన్న ఆలోచన చేశారంటే నమ్మశక్యం కాదు. కానీ ఆ పరిస్థితిని కూడా ఆయన అధిగమించారు. 1994 నుండి సినిమారంగంలో ప్రవేశించి ఎన్నో జనరంజక పాటలు పాడి జనం మనిషిగా జీవించారు. పాడిన పాటలు కొన్నే అయినా అవి జనబాహుళ్యంలో చూపించిన ప్రభావం అజరామరం. ఆయన పాడిన పాటలకి, కవితలకి ఎన్నో ప్రశంసలు, అవార్డులు కూడా దక్కాయి. సామాజిక ఇతివృత్తాలతో నారాయణమూర్తి తెరకెక్కించిన ప్రతి సినిమాలో అందెశ్రీ పాటలు పాడారు. ‘పల్లెనీకు వందనాలమ్మా / ‘మాయమై పోతున్నడమ్మో పోతున్నాడమ్మా మనిషన్నవాడు/ ‘గలగల గజ్జెలబండి, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా/ ‘జన జాతరలో మన గీతం/ ‘యెల్లిపోతున్నావా తల్లి/ ‘చూడ చక్కని.. ‘ వంటి ఎన్నో జనరంజక పాటలు ఆయన గళం నుండి జాలువారాయి.
తెలంగాణ రాష్ట్ర గీతం.. అందెశ్రీదే: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రభావం చూపించిన విప్లవ కవుల్లో అందెశ్రీ కూడా ఒకరు. ఆయన పాడిన పాటలు, కవితలు ఇప్పటికీ జనం గుండెల్లో చైతన్యదీపికలుగా నిలిచిపోయాయి. అందెశ్రీ పాడిన ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం..’ పాట తెలంగాణ జాతీయగీతంగా ప్రకటించడం అందెశ్రీ ప్రతిభకి అద్దం పడుతుంది. ‘మాయమైపోతున్నడమ్మో..’ అన్న పాట డిగ్రీ విద్యార్థుల తెలుగు వాచకంలో ప్రచురించి, ‘వందేమాతరం, మా తెలుగు తల్లి.. వంటి గీతాల వరుసలో చేర్చారు. దీని గురించి ఆయన ఒకసారి ఇలా స్పందించారు. ‘ఈ స్థాయి నేను ఊహించలేదు.. అయినా మనిషి ఏది ఊహిస్తే అది జరుగు తుందా ఈ ప్రపంచంలో.. వైదికం, విప్లవోద్యమాలు, దళితోద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం ఏదైనా మనిషిని నిటారుగా నిలబెట్టాలని కలలుగన్నవే. దానిని త్రికరణశుద్ధిగా ఆచరించేవాడు అలాగే ఉంటాడు. అది లేనివాడే పడుతుంటాడు.. లేస్తుంటాడు..’ అంటారు.
నా గుర్తింపు.. నా పాటే..: గుర్తింపు రావడం గురించి ఆయన ఒకసారి ఇలా అన్నారు. ‘నా పాట ఆగిపోతే.. అంటే నేను పాడలేకపోతేనే బాధపడతాను.. నా పాటకి గుర్తింపు వచ్చిందా.. లేదా అనేది నేను ఎప్పుడూ పట్టించుకోను. సమాజాన్ని చదివే క్రమంలో నాకు తెలియకుండానే చాలా దూరం ప్రయాణం చేస్తాను.. ప్రపంచానికి సంగీత భిక్ష పెట్టింది జానపదుడు. లోకసాహిత్యమే సంగీతానికి ఆది. కన్నోలెవరో.. అని కంటిధారగా ఏడ్సిన నాకు.. ఈ కథలెందుకు.. ఈ యశస్సులేవీ నేను కోరుకోలేదు. 22 ఏళ్లు.. ఉప్పరోడిగా పనిచేశాను. 10 ఏళ్లు జీతగాడిగా బతికాను. కడలి మీద వచ్చే అల ఆకాశాన్ని అందుకోవాలని ఎగిసిఎగిసి పడుతుంది. చివరికి తీరులో
తలకొట్టుకుని వెనక్కి పోతుంది. అచ్చం ఆ అల మాదిరే నా గీతాలు ఆకాశాన్ని కాదు.. నేల మీద, నేల మీది మనుషుల చుట్టూ ఉండాలని అనుకుంటాను. నది నడిసిపోతున్నది.. నన్ను నాచనై రమ్మన్నది.. పలుచూరు పిలుచున్నది.. నాలో ప్రాణమై దాగున్నది.. పాదాలే లేకున్నా.. పయనమెపుడు ఆగదు.. ఎదురేది నిలుచున్నా.. బెదిరి వెనుదిరగదు.. నేనూ అలానే.. ఆ నదిలా ప్రజలకి అనుసంధానంగా సాగిపోతాను..’
