ప్రభాతదర్శిని( శ్రీకాళహస్తి – ప్రతినిధి): రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కూటమిపాలనలో దేవస్థానం చైర్మన్ పదవితోపాటు మరో ఇద్దరు పాలకమండలి సభ్యులకు, ఒక టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కు అవకాశాలపించడం, బిజెపి నుండి ఒక పాలకమండలి సభ్యురాలు ఇద్దరూ ప్రత్యేక ఆహ్వానితులు, ఒకరికి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా అవకాశాలు లభించడంతో అటు బిజెపి ఇటు జనసేనలో నేతలు ఖుషి ఖుషి గా ఉన్నారు. అయితే శ్రీకాళహస్తి అంటే బొజ్జల, బొజ్జల అంటే శ్రీకాళహస్తి, టిడిపి అంటే బొజ్జల, బొజ్జల అంటే టిడిపి నినాదంతో ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవుల పందారం దక్కకపోవడంతో నైరాశ్యంలో ఉన్నారు. కేవలం వాకచర్ల గుర్రప్పశెట్టి, గోపి రామానాయుడు సతీమణి లక్మమ్మకి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అవకాశం, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లుగా మిన్నల రవి, సుబ్రహ్మణ్యం రెడ్డి చిన్నారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ భాషా, రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం బోర్డ్ డైరెక్టర్ గా సుబ్బయ్య, హస్తకళ అభివృద్ధి బోర్డ్ డైరెక్టర్ గా గుమ్మడిపూడి దశరదాచారి నియమితులు కావడంతో చావు తప్పి కన్ను లొట్ట పోయింది అన్నట్టు తెలుగుదేశం పరిస్థితి నెలకొంది. వాస్తవానికి గత వైసిపి పాలనలో కేవలం 16 నుంచి 20 మంది నాయకులే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలను, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు కేసులను నిరసన తెలపడంలో ముందున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో సింహ భాగం తెలుగు తమ్ముళ్లను వరిస్తుందని అంతా ఊహించారు. అయితే అధిష్టాన నిర్ణయంతో గంపెడాశలతో ఉన్న తెలుగు తమ్ముళ్లు గుప్పెడు ఆశలతో సరిపెట్టుకుంటూ అసంతృప్తికి లోనై అటు పార్టీ ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మొక్కుబడిగా హాజరవుతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించినప్పటికీ ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే, ప్రభుత్వ పాలనపై ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలను దీటుగో ఎదుర్కొనేవారు లేక దీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకు చక్కని ఉదాహరణ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్ రెడ్డి ఆలయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఉటంకిస్తూ దేవస్థానం ఈవో పై చేసిన విమర్శలకు, 15 కోట్ల మట్టి అక్రమ రవాణా పై చేసిన విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. అయితే దేవస్థానం పాలకమండలి సభ్యుడు గాదిపాకుల గోపి, మాజీ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు కాసరం రమేష్ లు మాత్రమే మాజీ ఎమ్మెల్యే విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ వైసిపి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై స్పందించిన విషయం తెలిసిందే.అంతే రీతిలో ఐ టిడిపి కూడా కొంత వరకు సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి విమర్శలు, వైసీపీ నేతలు విమర్శలకు ప్రతి విమర్శలు నెట్టింట్లో చేశాయి.ఎమ్మెల్యే కొంత మంది ముఖ్య నేతలకు మౌకికం ఆదేశించినా కుంటి సాకులు చూపి ముఖం చాటేస్తున్నట్లు సమాచారం.అయితే రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చే విమర్శలను డాక్టర్ ఉమేష్ రావు, వారి అనుచరులు సమర్థవంతంగా ఎదుర్కొంటూ వున్నారు.మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలను తిప్పి కొట్ట లేక పోవడం చూస్తే అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అవగతం అవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టిడిపి నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల పందారంలోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆశించిన సీట్లు, ఫలితాలు దక్కే అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకనైనా అటు అధిష్టానం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చే రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో టిడిపి అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
