ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్‌బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో బాదితుని తరుపున లంచం డిమాండ్ చేసిన ఉద్యోగి పై ఫిర్యాదు అందుకున్న విశాఖపట్నం ఎ.సి.బి.అధికారులు దాడి చేసి చేసి లంచం స్వీకరిస్తున్న సమయంలో ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన సూర్య నారాయణను గురువారం విశాఖ పట్నం లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచ నున్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శక మైన పాలనను ప్రభుత్వం చేపడుతూ ఉన్నప్పటికీ ఎక్కడైనా అవినీతి జరుగు తున్నట్లు తెలిసినా వెంటనే ఎ.సి.బి. టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది.