తొలిదశ ఇంజనీరింగ్ ప్రవేశాలకు 22 చివరి తేదిసాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను 22వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్దేశించిన తేదీని ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులు రిపోర్ట్ చేయక పోతే కేటాయించిన సీటు 23వ తేది నాటికి ఖాళీగా పరిగణించబడుతుందని డాక్టర్ నవ్య హెచ్చరించారు. మరోవైపు 23 నుండి ప్రారంభమయ్యే 2వ దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ కు అందుబాటులో ఉన్న సీటుగా చేర్చబడుతుందన్నారు. అన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు అభ్యర్థి కళాశాలలో నివేదించిన వెంటనే పోర్టల్‌లో చేరే వివరాలను అప్‌ డేట్ చేయాలని స్పష్టం చేసారు. కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా 23 నాటికి పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలన్నారు.