• ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • ఎయిర్పోర్ట్ ఏర్పాటు పరిశీలనకు విచ్చేసిన కేంద్ర బృందం
    ప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం దగదర్తి విమానాశ్రయం ఏర్పాటు ప్రాంతాన్ని భారత ప్రభుత్వ విమానయాన సంస్థ DGM మల్లికా జయరాజ్, DGM పరవేంధర్ తివారి, సీజేంద్ర కుమార్ రెడ్డి, సుజీన్ రాజు పరిశీలించారు. ఈ పర్యటనలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ దగదర్తి లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రక్రియ మొదలుపెట్టినట్లు చెప్పారు. విమానాశ్రయం ఏర్పాటు పరిశీలనకు ఢిల్లీ నుంచి విచ్చేసిన కేంద్ర బృందానికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 1400 ఎకరాల భూములు అవసరం కాగా, ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం చెల్లించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. విమానాశ్రయం ఏర్పాటుకు రైతులంరూ కూడా సహకరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మనం భాగస్వామిగా వుండడంతో అనేక పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి పనులు మొదలవుతున్నాయని చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు దగదర్తికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బృందాన్ని పరిశీలనకు పంపడం, ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు వెంటనే మొదలుపెట్టాలని ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామంగా చెప్పారు. ఇది ప్రారంభం అని ఇక ఆగదని ఎంపీ అన్నారు. నెల్లూరుజిల్లాలో బిపిసిఎల్‌, ఇండోసోల్‌ వంటి పెద్దపెద్ద పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, మరిన్ని పరిశ్రమలు కూడా ముందుకొస్తున్నాయని, గ్రామస్థులకు ఇబ్బందులు లేకుండా పర్యావరణ నిబంధనలను మేరకు అనుమతులు ఇచ్చేలా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని, దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగానికి నెల్లూరు జిల్లా ఒక దిక్సూచిలా మరనుందన్నారు. 2019 జనవరి 6న సీఎం హోదాలో చంద్రబాబు విమానాశ్రయం ఏర్పాటుకు భూమి పూజ చేశారని, ఆ సమయంలో తాను కావలి ఇన్చార్జిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సుమారు రెండేళ్లలోనే ఈ పనులన్నీ కూడా పూర్తయి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. రైతులందరూ కూడా తమ బిడ్డల భవిష్యత్తు కోసం భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఎవరికి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం చెల్లించేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టినట్లు ఎంపీ చెప్పారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పూర్తిగా విమానాశ్రయాన్ని నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయన్నారు. రామాయపట్నం పోర్టు, కృష్ణపోర్టుకు అనుసంధానంగా దగదర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మించాలని, జిల్లాలో పారిశ్రామి ప్రగతి సాధించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారని చెప్పారు. డిపిఆర్‌లు తయారుచేసి 96 కోట్ల నిధుల విడుదలకు కూడా సీఎం ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఎయిరిండియా అధికారులు టెండర్లు, డిపిఆర్‌ మొదలైన ప్రక్రియలను పూర్తి చేయాలని కోరారు. అన్ని పనులు పూర్తయితే త్వరలోనే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.