ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): వినియోగదారులపై భారం పడకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్, సన్ ప్లవర్ ఆయిల్, ఎర్రగడ్డలు, టమోటాల ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని హోల్ సేల్, రిటైల్ వర్తకులతో మాట్లాడి ఇన్వాయిస్ ధరకే పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసి ఎటువంటి ఆదాయం లేకుండా ఉత్పత్తి ధరకే ప్రజలకు అందేలా చూడాలన్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దుకాణాల్లో పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తో పాటు ఉల్లిపాయలు, కందిపప్పు, మినప్పప్పు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ధరల పెరుగుదల సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను మోసం చేయకుండా ఖచ్చితమైన తూకం అందించేలా తూనికల కొలతల శాఖల అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. హోల్ సేల్, రిటైల్ ట్రేడర్లు కూడా ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరమణ, మార్కెటింగ్ ఎడి అనిత, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ఐజాగ్, సివిల్ సప్లయిస్ డిఎం లక్ష్మీ నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.