ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నారాయణ
రిటర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన పొంగూరు రమాదేవి
కుటుంబసభ్యులు, టీడీపీ అగ్రనేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ
అడగకుండానే గతంలో ఎన్నో చేశా…ప్రస్తుతం పోటీ చేస్తున్న కాబట్టి బాధ్యతగా తీసుకుంటున్నా
భారతదేశంలోనే నెల్లూరును మోడల్‌సిటీగా మారుస్తానని హామీ ఇచ్చిన నారాయణ…
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):
ప్రస్తుతం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న కాబటి నెల్లూరు నగర నియోజకవర్గంలోని రెండు లక్షల 37 వేల మంది ప్రజల బాధ్యతను తాను తీసుకుంటానని మాజీ మంత్రివర్యులు, సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో నారాయణ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలోకి నారాయణ, ఆయన సతీమణి రమాదేవిలతో పాటు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్‌కు నారాయణ ఓ సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ఓ సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబసమేతంగా డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. తమ నామినేషన్ పర్వానికి తరలివచ్చిన ప్రజానికానికి, ఉమ్మడి పార్టీల శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిన క్రమంలో… సింహపురి నగరంలో పుట్టిపెరిగాను కాబట్టి… సొంతూరు రుణం తీర్చుకునేలా బాధ్యతగా పనిచేస్తూ… అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తానని తెలియజేశారు. గతంలో తాను ప్రత్యక్షంగా పోటీ చేయకున్నప్పటికీ… తెలుగుదేశంపార్టీకి చేసిన సేవకు గుర్తింపుగా నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కిందన్నారు. అయితే వచ్చిన పదవిని స్వార్థానికి ఉపయోగించుకోకుండా… నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను… సొంతూరికి మంచి చేయాలని ఎంతో చేశానని చెప్పారు. రాజధాని నిర్మాణంలో భాగంగా దేశవిదేశాల్లో తిరిగినప్పుడు ఆయా దేశాల్లో పరిస్థితులు, వసతులు, స్థితులను గమనించి… అంతకుమించి ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించి రాజధాని నిర్మాణం చేపట్టామన్నారు. అదేమాదిరిగా నెల్లూరును సైతం డెవలప్మెంట్ చేశామని తెలియజేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్‌కు ఏమేమీ ఉండాలో అవన్నీ కోట్ల రూపాయల నిధులతో చేశానన్నారు. ఇందుకు నెల్లూరును దోమలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు అండర్గ్రౌండ్డ్రైనేజి, సొంతింటి కల నెరవేర్చేందుకు టిడ్కో ఇళ్ల నిర్మాణం, 365 నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీటి వసతి, ఆహ్లాదానికి పార్కుల నిర్మాణం, దుమ్ముధూళి లేకుండా ఎండ్ టూ ఎండ్ సిమెంట్‌రోడ్ల నిర్మాణం, నెక్సెస్రోడ్డు, అన్నక్యాంటీన్లు, బారాషాహిద్ దర్గా, చర్చీలు, దేవాలయాలు, ఏసీ బస్షెల్టర్లు, వీఆర్సీలో రెసిడెన్సీ, మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్లబోధన, పిల్లలు కింద కూర్చునేందుకు ఇబ్బందులు పడుతుంటే బల్లల ఏర్పాటుతో పాటు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని సుదీర్ఘంగా విశదీకరించారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన పనులు బేరీజు వేసుకుంటే నిజానిజాలు తెలుస్తాయన్నారు. అయితే అనంతరం 2019లో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం… టీడీపీ పాలనలో చేపట్టిన పనులన్నీంటిని నిరంకుశత్వదోరణితో మరుగున పెట్టడం ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తి చేస్తే ఎక్కడ చంద్రబాబుకి పేరు వస్తుందోనని వైసీపీ కుట్రతోనే ఆ పనులన్నీంటిని ఆపేసి పైశాచిక ఆనందం పడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. కానీ 2024లో ఖచ్చితంగా ప్రజాధరణతో అధికారంలోకి రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజారంజక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆగిన పనులన్నీంటితో పాటు రాజధాని నిర్మాణం పూర్తి చేసేదిశగా ముందుకెళ్తామన్నారు. నెల్లూరును భారతదేశంలోనే మోడల్ సిటీగా మారుస్తామని నారాయణ మాటిచ్చారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రెండు లక్షల 37 వేల మంది ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బాధ్యతగా పని చేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ నారాయణ నామినేషన్ ప్రక్రియ ఎంతో క్రమపద్దతిగా స్వాతంత్య్ర సాధన సమయంలో ఘట్టం మాదిరిగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఓ విజన్ ఉన్న నేత నారాయణ వూహాత్మకంగా వేస్తున్న అడుగులు నేటి తరం నాయకులకు ఆదర్శనీయమని కొనియాడారు. తాము క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నారాయణ వస్తున్న ఆదరణ చూస్తుంటే లక్ష మెజార్టీ పక్కా అని కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలంతా రానున్న ఎన్నికల్లో పొంగూరు నారాయణకు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళనాయకులు, తదితరులు పాల్గొన్నారు.