ప్రభాతదర్శిని (ఒంగోలు – ప్రతినిధి):ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీనగర్ నందు జరిగిన రెండవ అఖిల భారత పెంకాక్ సిల్కాట్ చాంపియన్స్ – 2024 పోటీలలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నుంచి పాల్గొన్న కే.ప్రేమ్ కుమార్ అఖిల భారత స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నట్లు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ. దేవీ వర ప్రసాద్ శుక్రవారం విలేఖర్లకు తెలిపారు. ఏ.కే.యూ తరుపున పెంకాక్ సిలాట్ పోటీలలో పాల్గొని రజత పతకం సాధించిన విద్యార్థి ప్రేమ్ కుమార్ ను ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు తదితరులు హృదయ పూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా వి.సి.ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా క్రీడలకు పుట్టినిల్లు లాంటిదని, ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని జిల్లాకు కీర్తి ప్రతిష్టలను సంపాదించారని ఆయన కొనియాడారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ తరుపున ఐ.యూ.టి పోటీల ద్వారా జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో తమ విశ్వ విద్యాలయం తరుపున పాల్గొన్న ప్రేమ్ కుమార్ రజత పతకం సాధించడం హర్షించదగిన విషయం అన్నారు.ఏ.కే.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ ఆంధ్ర కేసరి యూనివర్శిటీలో క్రీడాకారులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నామని, అంతే కాకుండా ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. యూనివర్శిటీ నిర్వహించే తుది పరీక్షలలో పతకాలను సాధించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా బోనస్ మార్కులను ఇవ్వడం జరుగు తుందని పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఏర్పడిన తొలినాళ్లలోనే అఖిల భారత స్థాయిలో తమ యూనివర్శిటీ విద్యార్థి ప్రేమ్ కుమార్ రజత పతకాన్ని సాధించడం పట్ల ఏ.కే.యూ.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు, ఏ.కే.యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ. దేవీ వర ప్రసాద్, అతిథి అధ్యాపకులు అడపాల. వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇంకా అనేక మంది విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులు గా తీర్చి దిద్దేందుకు తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. అఖిల భారత స్థాయిలో రజత పతకాన్ని సాధించి దేశ స్థాయిలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేసిన ప్రేమ్ కుమార్ ప్రస్తుతం ఒంగోలు నగరం లోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి మొదటి సంవత్సరం చదువు చున్నాడు.