కలర్ షైన్ లో మృతిచెందిన కార్మికునికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలి
1 min read
కలర్ షైన్ లో మృతిచెందిన కార్మికునికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలి
ప్రభాతదర్శిని-ప్రతినిధి గూడూరు మండలం మంగళపూరు పంచాయతీలో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో మృతిచెందిన కార్మికుడు సలీం కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్.ప్రభాకర్ డిమాండ్ చేశారు.శుక్రవారం సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలర్ షైన్ కంపెనీ యాజమాన్యం నిబంధనలను తుంగలో తొక్కి కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీం అనే 30 ఏళ్ల యువకుడు మూడు రోజుల క్రితం ఫ్యాక్టరీలో పనిచేస్తూ చనిపోతే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేశారన్నారు.కనీసం ఆ ఫ్యాక్టరీకి వైద్యుడు కూడా లేడన్నారు.అత్యవసర సమయాలలో కార్మికులు ప్రమాదానికి గురైతే గూడూరు, తిరుపతి ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ కూడా లేదన్నారు.ఇన్సాఫ్ సమితి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్.జమాలుల్లా, డివిజన్ అధ్యక్షులు అన్వర్ బాష మాట్లాడుతూ ఫ్యాక్టరీ స్థాపించి ఐదేళ్లయినా సీఎస్ఆర్ నిధులు చెల్లించడం లేదన్నారు.స్థానికులకు పదిశాతం కూడా ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు.అధికారులు, రాజకీయ నాయకులు,ప్రజా సంఘాలు,కుల సంఘాలంటే ఆ కంపెనీ యాజమాన్యానికి లెక్కేలేదన్నారు.బీజేపీ నేతలు మాకు మద్దతుగా ఉన్నారని, ఇష్టమొచ్చిన వారికి చెప్పుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మృతి చెందిన సలీం కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం అందించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎంబేటి చంద్రయ్య,ఇన్సాఫ్ సమితి గూడూరు డివిజన్ అధ్యక్షులు ఎండీ.అన్వర్ బాష,పట్టణాధ్యక్షులు షేక్. చాన్ బాష తదితరులు పాల్గొన్నారు.